ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 60 గంటల పాటు కొనసాగింది. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన మొత్తం 54 మంది కార్మికుల్లో 8 మంది చనిపోయారు. 46 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
చమోలీ జిల్లాలోని మాణా వద్ద మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆదివారం నలుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది.
ఫిబ్రవరి 28న 54 మంది బీఆర్వో కార్మికులు మానా పాస్ వద్ద మంచు చరియలు విరిగిపడిన ప్రమాదంలో చిక్కుకున్నారు.
ఆర్మీ, ఐటీబీపీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మొత్తం 54 మంది కార్మికుల్లో 8 మంది మరణించారు.
చమోలీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (కలెక్టర్) సందీప్ తివారీ బీబీసీతో మాట్లాడుతూ, "మొత్తం కార్మికుల సంఖ్య 54, వారిలో 46 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 8 మంది చనిపోయారు'' అని చెప్పారు.
"చనిపోయిన 8 మందిలో ఏడుగురి మృతదేహాలను జోషిమఠ్ జిల్లా ఆసుపత్రికి తరలించాం. పోస్టుమార్టం పూర్తయింది."
"చివరి మృతదేహాన్ని ఇప్పుడే గుర్తించాం. వాతావరణం అంతా అనుకూలంగా ఉంటే, ఆ మృతదేహాన్ని కూడా ఈరోజే ఆస్పత్రికి తరలించవచ్చు. లేదంటే రేపు ఉదయం మృత దేహాన్ని జోషిమఠ్ కు తరలిస్తాం'' అని కలెక్టర్ సందీప్ తివారీ తెలిపారు.
మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీ, ఐటీబీపీ, ఎయిర్ ఫోర్స్ , ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ తమవంతు కృషి చేశాయన్నారు.
"సైనికుల వల్లే 46 మందిని రక్షించగలిగాం" అని సందీప్ తివారీ అన్నారు.
మాణా గ్రామం వద్ద..
బద్రీనాథ్ ధామ్ కు సమీపంలోని మాణా గ్రామం వద్ద ఫిబ్రవరి 28వ తేదీ, శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
''మాణా గ్రామానికి, మాణా పాస్ కి మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సమీపంలో ఈ మంచు చరియలు విరిగిపడ్డాయి'' అని కలెక్టర్ సందీప్ తివారీ తెలిపారు.
ఆర్మీకి చెందిన ఐబీఈఎక్స్ బ్రిగేడ్ నేతృత్వంలో సెర్చ్ ఆపరేషన్ జరిగింది.
ఆ రోజు ఏం జరిగింది?
ఆర్మీ కోసం జరుగుతున్న ఓ రోడ్డు నిర్మాణంలో 54 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారంతా మంచుచరియల్లో చిక్కుకుపోయారని సందీప్ తివారీ చెప్పారు.
తొలుత 57 మంది ఉన్నట్లుగా భావించారు. ఆ తర్వాత, ఇద్దరు కార్మికులు సెలవులో ఉన్నారని, 55 మంది అక్కడ చిక్కుకుపోయినట్లు కలెక్టర్ చెప్పారు. తాజాగా మరొకరు అనధికారిక సెలవులో ఉన్నారని ఆయన తెలిపారు.
"బీఆర్ వో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో ఈ కార్మికులంతా పనిచేస్తున్నారు. ఆర్మీ కోసం రోడ్డు నిర్మిస్తున్నారు.''
''నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలో వారు శిబిరాలు ఏర్పాటు చేసుకుని కంటెయినర్లలో నివసిస్తున్నారు. ఉదయం మంచు చరియలు విరిగిపడగానే తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ఐటీబీపీ క్యాంప్ వైపు, మరికొందరు జోషిమఠ్ వైపు పరిగెత్తారు'' అని సందీప్ తివారీ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్ , ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ , ట్విటర్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్ స్క్రైబ్ చేయండి.)
Comments
Leave a Comment