గర్భం రాకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు, కండోమ్స్ వంటి వాటిని జంటలు ఉపయోగిస్తుంటాయి. అయితే, మహిళలు ఇప్పుడు అవాంఛిత గర్భాన్ని అడ్డుకునేందుకు టెక్నాలజీపై ఆధారపడుతున్నారు.
ఆరోగ్యంపై ప్రభావం చూపే గర్భనిరోధక మాత్రలను వాడడానికి బదులు.. ఫోన్ లోని ఓ యాప్ తో ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా గర్భం దాల్చకుండా జాగ్రత్తపడుతున్నారు.
కాకపోతే, ఈ యాప్ లు ఎంతమేర ఉపయోగపడుతున్నాయి? వీటికి కచ్చితత్వం ఎంత? గర్భం దాల్చకుండా ఉండేందుకు మహిళలు వీటిపై పూర్తిగా ఆధారపడవచ్చా? ఈ కథనంలో తెలుసుకుందాం.
అబార్షన్ కోరుకునే కొంతమంది మహిళలు హార్మోన్లపై పనిచేసే గర్భనిరోధక మాత్రల వంటివి కాకుండా సహజ సంతానోత్పత్తి ట్రాకింగ్ యాప్ ల కు మారుతున్నట్లు బీబీసీ రిపోర్ట్ చేసినప్పుడు, మరికొంతమంది మహిళలు తమ అనుభవాలను పంచుకోవడానికి బీబీసీని సంప్రదించారు.
దుష్పరిణామాలు లేని, తమ జీవన విధానానికి తగ్గ గర్భ నిరోధక విధానాలను గుర్తించడం ఎంతో కష్టమని ఆ మహిళలు బీబీసీకి చెప్పారు.
ఈ గర్భనిరోధక విధానాలన్నింటిలో మంచి, చెడూ రెండూ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
''మీరు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఉపయోగపడే ఒక విధానం మీరు 28, 38, లేదా 48 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పనిచేయకపోవచ్చు'' అని ఎస్ హెచ్:24 మెడికల్ డైరెక్టర్ పౌలా బ్రెయిట్సర్ చెప్పారు. ఎస్ హెచ్:24 అనేది ఉచిత లైంగిక ఆరోగ్య సేవలు అందించే సంస్థ. ఇది ఎన్ హెచ్ ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్)తో కలిసి పనిచేస్తుంది.
సంతానోత్పత్తి ట్రాకింగ్ యాప్ లు మహిళలకు ఇప్పుడు కొత్త అవకాశంగా కనిపిస్తున్నాయి. కొంతమంది వాటిని ఉపయోగిస్తున్నారు కూడా.
అండం విడుదలను అంచనా వేయడానికి ఆ యాప్ లు శరీర ఉష్ణోగ్రతలు సహా అనేక లెక్కలు తీసుకుంటున్నాయి. దీంతో యాప్ ఉపయోగిస్తున్నవారికి తమ రుతుచక్రంలో గర్భందాల్చే అవకాశం ఎక్కువగా ఎప్పుడుందో అర్థమవుతుంది.
దీనిల్ల ఆ సమయంలో వారు లైంగిక సంబంధానికి దూరంగా ఉండొచ్చు లేదా కండోమ్ ఉపయోగించవచ్చు.
మీకు ఏది సరైనదో, కాదో తెలుసుకోవడం..
గర్భ నిరోధక మాత్రల వంటి హార్మోన్లపై పనిచేసే పిల్స్ వల్ల ఎదురైన ఇబ్బందుల తర్వాత కొంతమంది రోగులు ఈ యాప్ లకు మారడం గమనించినట్లు డాక్టర్ బ్రెయిట్సర్ చెప్పారు.
''హార్మోన్లు తీసుకోవడం వల్ల శరీరంలో మార్పులు వస్తాయి. అలాంటి ఔషధాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తాయి. అది సానుకూలంగా ఉండొచ్చు..లేదా ప్రతికూలంగా మారొచ్చు'' అని ఆమె వివరించారు.
''ఉదాహరణకు, ఈస్ట్రోజెన్ మొటిమలను తగ్గిస్తుంది. మాత్రలతో పాటు ఇతర గర్భనిరోధక విధానాలు రక్తస్రావాన్ని నియంత్రించడంలో సాయపడతాయి.
అదే సమయంలో కొందరి మానసిక స్థితి, లైంగిక సంబంధంపై ఆసక్తి మారిపోతుంటుంది.
మీకు ఏ విధానం సరిపోతుంది, ఏది సరికాదు అనేది తెలుసుకునే క్రమంలో వీటిని వాడిచూడాలి'' అని ఆమె సూచించారు.
గర్భాన్ని నిరోధించడంతో పాటు లైంగికంగా సంక్రమించే చాలా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నివారించగలిగేది కండోమ్స్ మాత్రమే.
కొంతమంది మహిళలతో మాట్లాడి బీబీసీ సమాచారం సేకరించింది. అయితే, వారి గుర్తింపును గోప్యంగా ఉంచడానికి వారి ఫొటోలు, అసలు పేర్లు ఈ కథనంలో ప్రచురించలేదు.
బ్రిస్టల్ కు చెందిన 25 ఏళ్ల జార్జియా, ఏడు నెలలుగా సంతానోత్పత్తి ట్రాకింగ్ యాప్ ను ఉపయోగిస్తున్నారు.
గర్భ నిరోధక మాత్రలు తీసుకోవడం మానేసిన తర్వాత తన మానసిక ఆరోగ్యం బాగా మెరుగుపడిందని జార్జియా చెప్పారు. ఆమె దాదాపు పదేళ్ల నుంచి ఆ మాత్రలు ఉపయోగిస్తున్నారు.
ఈ మందులను జాగ్రత్తగా వాడకపోతే గర్భం దాల్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని జార్జియాకు తెలుసు.
''గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల నా మానసిక స్థితి నిరంతరం మారుతూ ఉండేది. నా మానసిక స్థితిని నియంత్రించుకోలేకపోతున్నానని నాకు అనిపించింది. మాత్రలు వాడడం మానేయాలని నిర్ణయించుకున్న తర్వాత, నా భావోద్వేగాలను, జీవితం విషయంలో నా ఆలోచనలను, నా గురించి నాకున్న భావాలను నియంత్రించుకోగలిగాను'' అని జార్జియా చెప్పారు.
కాపర్ ఐయూడీతో అధిక రక్తస్రావం
''నేను కాపర్ ఐయూడీ (కాపర్-టి)ని వాడాను. కానీ అధిక రక్తస్రావం కారణంగా వాటిని వాడడం ఆపేశా. నాకు పీరియడ్స్ సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాపర్-టి వాడకం వల్ల రక్తస్రావం మరింత ఎక్కువగా ఉండేది. దీంతో నాకు అది వాడాలనిపించలేదు. చాలా కాలం నుంచి నా శరీరం హార్మోన్లలో మార్పులు వస్తున్నాయని నాకు తెలుసు. అది నాకు చాలా ఆందోళన కలిగించింది. ఈ సమస్యను కొనసాగించకూడదని నేననుకున్నా'' అని ఆమె తెలిపారు.
''నేను పర్సనల్ ట్రైనర్ ని. ఎప్పుడూ మహిళలతో కలిసి పని చేస్తాను. గర్భనిరోధక సాధనాల్లో కొత్త పద్ధతులు అందుబాటులోకి రాకపోవడం నాకు నిరాశ కలిగించేది.''
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే...'దీన్ని ప్రయత్నించండి' అని చెబుతారు. కానీ, ఆ గర్భనిరోధక సాధనం మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది.
ఇప్పుడు ట్రాకింగ్ యాప్ విషయానికొస్తే.. దీన్ని ఉపయోగిస్తే నా శరీరం ఎలా స్పందిస్తుంది అనేది కచ్చితంగా తెలుసుకోవాలని నేననుకుంటున్నా'' అని జార్జియా చెప్పారు.
గర్భనిరోధకాలు ఎక్కువగా అందుబాటులో లేవు
గ్లాస్గోలో నివసించే 39 ఏళ్ల ఎమిలీ, తాను గర్భవతి అని తెలుసుకున్న తర్వాత 2021లో అబార్షన్ చేయించుకున్నారు. ఆ సమయంలో, ఆమె గర్భనిరోధక సాధనంగా ట్రాకింగ్ యాప్ ను ఉపయోగిస్తున్నారు.
ఎమిలీ 17 సంవత్సరాల వయస్సు నుంచి తీసుకుంటున్న గర్భనిరోధక మాత్రలను 2018 నుంచి ఆపేశారు. మొదట ఆమె మొటిమలకు చికిత్స కోసం ఈ మాత్రలు వాడడం ప్రారంభించారు.
''నాకు బాధగా, చిరాగ్గా ఉండేది. నేను బరువు పెరగడం మొదలైంది. ఏ పనీ చేయలేకపోయేదాన్ని. లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోయేది. దీంతో మాత్రలు తీసుకోవడం మానేశాను. ఆ తర్వాత నా ఆరోగ్యం మెరుగుపడినట్టు అనిపించింది'' అని ఎమిలీ చెప్పారు.
హార్మోన్లపై ప్రభావం చూపని వాటి కోసం ఎమిలీ వెతికారు. కాపర్-టీ ఉపయోగించడం ఆమెకు ఇష్టం లేదు. చివరకు ఆమె తన ఐఫోన్ హెల్త్ యాప్ లో పీరియడ్స్ ట్రాకింగ్ ఫీచర్ ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
తాను రెండునెలల గర్భవతినని 2021లో ఎమిలీ గుర్తించారు. అప్పుడు ఆమె భాగస్వామిగా ఉన్న వ్యక్తి ఇప్పుడామె భర్త. అప్పుడు నాలుగు నెలలుగా వారి మధ్య సంబంధముంది.
''నాకు మూత్రనాళాల సంబంధిత సమస్య వచ్చింది, దాని వల్ల నా రుతుచక్రంలో కొంత అంతరాయం కలిగింది. దీంతో కొన్ని నెలలు నాకు పీరియడ్స్ రాలేదు. అందుకే నేను గర్భవతినన్న విషయం నాకు అర్ధం కాలేదు. నా ఆరోగ్యం కొంత క్షీణించిన తర్వాత నాకో విషయం అర్ధమైంది. నాకు కరోనా సోకి ఉండొచ్చు లేదా నేను గర్భవతిని అయ్యుండొచ్చు అని నేను భావించా. ఇంటికి వచ్చి రెండు పరీక్షలూ చేసుకున్నా. నేను గర్భం దాల్చినట్టు తేలింది.
ఇది విన్న తర్వాత నా భాగస్వామి చాలా సంతోషించారు.
దీని గురించి నా భర్తతో (ఆ సమయంలో నా భాగస్వామి)మాట్లాడాను. ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న సమాచారం తెలుసుకున్నా. ఆ సమయానికి మేం ఒకరి గురించి మరొకరం పూర్తిగా తెలుసుకోలేదు. మేం కలిసి జీవించడం లేదు. అందుకే గర్భాన్ని కొనసాగించకూడదని మేం నిర్ణయించుకున్నాం'' అని ఎమిలీ చెప్పారు.
అబార్షన్ చేయించుకున్న తర్వాత మరో గర్భనిరోధక విధానాన్ని ప్రయత్నించాలని ఎమిలీ నిర్ణయించుకున్నారు.
పీరియడ్స్ సక్రమంగా వచ్చేవారికే యాప్ సరైనదా?
''ట్రాకింగ్ యాప్ లను ఉపయోగించాలంటే పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తుండాలన్న విషయం నాకర్థమైంది. మరోసారి అలాంటి ప్రమాదం తెచ్చుకోవాలని నేననుకోలేదు'' అని ఎమిలీ తెలిపారు.
హార్మోన్లపై ప్రభావం చూపని కాపర్ కాయిల్ ను ఆమె ఎంచుకున్నారు.
''నాకు నడుము నొప్పి సమస్య ఉంది. కాయిల్ ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత, పీరియడ్స్ సమయంలో ఆ నొప్పి బాగా పెరిగింది. అండం విడుదల సమయంలో నొప్పి వస్తోంది. ఈ విధానం సరైనది కాదు. కానీ, వేరే అవకాశం లేదు.
ఇతర రంగాల్లో చాలా వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, గర్భనిరోధక సాధనాల విషయానికి వస్తే, మనం ఇప్పటికీ 50 ఏళ్ల నాటి గర్భనిరోధక మాత్రలు, నొప్పి కలిగించే కాయిల్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది" అని ఎమిలీ ఆవేదన వ్యక్తంచేశారు.
మహిళలకే ఈ బాధ్యత ఎందుకు?
తన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందో లేదో తెలుసుకోవడానికి 26 ఏళ్ల ఫ్రెయా హార్మోన్లపై ప్రభావం చూపే గర్భనిరోధకాలు తీసుకోవడం మానేశారు.
''15 ఏళ్ల వయసు నుంచి నేను వాటిని ఉపయోగిస్తున్నా. అవి లేకుండా నేనెలా ఉంటానో నాకసలు తెలియదు. నేను గర్భం దాల్చే అవకాశముందని యాప్ లో కనిపించినప్పుడు కండోమ్ లు ఉపయోగించాను'' అని ఫ్రెయా చెప్పారు.
"తర్వాత మూడు నెలల్లోనే నేను గర్భవతిని అయ్యాను. దీంతో అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. దీనివల్ల నా మానసిక, శారీరక ఆరోగ్యంపై చాలా ప్రభావం పడింది.
సాధారణ గర్భనిరోధక సాధనాలకు బదులు యాప్ ఉపయోగించడం వల్ల ఇలాంటి పరిస్థతి వచ్చిందని నాకు తెలుసు. కానీ నేనెవరికీ ఇది చెప్పలేకపోయాను'' అని ఫ్రెయా చెప్పారు.
సాధారణ గర్భనిరోధక పద్ధతుల వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అనుభవం తర్వాత మళ్లీ వాటిని వాడటం మానేశానని ఫ్రెయా చెప్పారు.
41 ఏళ్ల అలైస్ ఫార్న్ బొరోకు చెందినవారు. గర్భనిరోధక మాత్రల వల్ల ఆమెకు అనేక సమస్యలు వచ్చాయి. లైంగిక ఆసక్తి తగ్గడం, బరువు పెరగడం, మానసిక స్థితి మారిపోవడం, రక్తస్రావం వంటి దుష్పరిణామాలు ఏర్పడ్డాయి.
''నాకు ఒక కూతురు ఉంది. ఆమె భవిష్యత్తు గురించి నాకు ఆందోళనగా ఉంది. గర్భం దాల్చకుండా ఉండటానికి మహిళలు, బాలికలే ఎందుకు బాధ్యతగా ఉండాలి? ప్రసవం తర్వాత వెంటనే, 'మీకు ఎలాంటి గర్భనిరోధకం కావాలి?' అని అడుగుతారు.
"అదృష్టవశాత్తూ నా భర్త కండోమ్ లు వాడటానికి అభ్యంతరం చెప్పడం లేదు. నేను ఇప్పుడు నా పీరియడ్స్ ని ట్రాక్ చేయడానికి సంతానోత్పత్తి యాప్ ను ఉపయోగిస్తున్నాను, కానీ, నేను నిజంగా దానిపై ఆధారపడలేదు'' అని ఆమె అన్నారు.
యాప్ లపై ఆసక్తి ఉన్నవారు పరిగణనలోకి తీసుకోవాల్సిన కీలక అంశాలు..
పీరియడ్ ట్రాకింగ్ యాప్ లు అన్నీ ఒకేలా ఉండవు. అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలిపేలా వాటిని డిజైన్ చేయలేదు.
మీ రుతు చక్రం ప్రతి నెలా ఒకేలా క్రమం తప్పకుండా లేకపోతే, గర్భం దాల్చే తేదీలు మారొచ్చు.
మీకు పీరియడ్స్ సక్రమంగా రాకపోతే గర్భం దాల్చే తేదీలను .. యాప్ లు అంచనా వేయడం కష్టం కావొచ్చు.
యాప్ సాధ్యమైనంత నమ్మదగినదిగా ఉండేలా చూసుకోవడానికి, మీరు యాప్ సూచనలను సరిగ్గా పాటించాలి.
శరీర ఉష్ణోగ్రతలు పరిశీలిస్తూ ఉండాలి, అదెలా చేస్తామనేది చాలా ముఖ్యం.
పిల్స్, యాప్ లలో ఏది బెటర్?
''అండం విడుదల తర్వాత చాలా తక్కువ స్థాయిలో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
ఈ చిన్న మార్పును మీరు గుర్తించడానికి, యాప్ సూచించినప్పుడల్లా శరీర ఉష్ణోగ్రతలు లెక్కించుకోవాలి. ఉదయం నిద్రలేచినప్పుడు, తినేముందు, ఏమన్నా తాగేముందు ఉష్ణోగ్రత ఎంత ఉందో చూసుకోవాలి. మీకు తీరికలేని జీవితం గడుపుతుంటే, రాత్రివేళల్లో పనిచేస్తుంటే, చిన్నపిల్లలు ఉంటే ఇన్నిసార్లు ఉష్ణోగ్రతలు చూసుకోవడం కష్టం కావొచ్చు'' అని బ్రెయిట్సర్ చెప్పారు.
నిరంతరాయంగా ఉష్ణోగ్రతలు పరిశీలించే స్మార్ట్ వాచ్ వంటి కొత్త టెక్నాలజీ కొంత ఉపయోగపడొచ్చని ఆమె అన్నారు.
సెక్స్ లో ఎప్పుడు పాల్గొనాలో వద్దో మాత్రమే యాప్ తెలియజేస్తుంది. అది చెప్పినట్టు చేయాలా? వద్దా? అన్నది మీ ఇష్టం.
ఇష్టం లేని గర్భం వచ్చే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని అనటోల్ మీనన్-జాన్సన్ చెప్పారు. ఆయన యూకే అంతటా లైంగిక ఆరోగ్య క్లినిక్ లు ఉన్న బ్రూక్ కంపెనీ క్లినికల్ డైరెక్టర్.
గర్భనిరోధక విధానాలపై మీరు ప్రయోగాలు చేయడానికి వీలుగా ఉండే వాటిని వెతుక్కోవాలని ఆయన సూచించారు.
''కొన్నిసార్లు మీ శరీరానికి సరిపోయేదాన్ని గుర్తించడానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది'' అని ఆయనన్నారు.
యాప్ లను సరిగ్గా ఉపయోగిస్తే అవి 93 శాతం నమ్మదగినవేనని, అంటే యాప్ ల ద్వారా ట్రాక్ చేసే ప్రతి వందమంది మహిళల్లో ఏడుగురు గర్భం దాల్చే అవకాశం ఉందని కంపెనీలు చెబుతున్నాయి.
గర్భనిరోధక మాత్రలు, ఇతర ఔషధాలను సరిగ్గా ఉపయోగిస్తే 91శాతం ఫలితాలుంటాయి. వీటితో పోలిస్తే యాప్ ల వాడకం కాస్త మెరుగైనదిగా అనిపిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్ , ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ , ట్విటర్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్ స్క్రైబ్ చేయండి.)
Comments
Leave a Comment